కాళేశ్వరం లింక్-2లో గోదారి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి కరీంనగర్ జిల్లాలోని ఎల్‌ఎండీ దాకా పరుగులు తీస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి జలాశయంలో 12.24 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో ఆరో ప్యాకేజీ ధర్మారం మండలం నంది పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. మూడు రోజులుగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మోటర్లను నడిపిస్తున్నారు. సోమవారం రాత్రి 4 మోటర్లను, మంగళవారం రాత్రి 5 మోటర్లను నడిపించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల నడుమ 15 నిమిషాల వ్యవధిలో 2, 3, 4, 5, 6 నంబర్ల మోటర్లను ఆన్ చేశారు.
ఇక్కడి నుంచి జలాలు ఎనిమిదో ప్యాకేజీ రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్ సర్జ్‌పూల్‌కు చేరుతున్నాయి. ఇక్కడ కూడా సోమవారం రాత్రి 9 గంటల నుంచి బాహుబలి మోటర్లు ఎత్తిపోస్తున్నాయి. రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఐదు పంపులు నడుస్తున్నాయి. బుధవారం 1, 2,3,4,7 పంపులను రన్ చేశారు. ఎత్తిపోసిన జలాలు గ్రావిటీ కాల్వ మీదుగా వరద కాల్వకు చేరుకొని, శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయానికి పరుగులు తీస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు సుమారు ఒక టీఎంసీ నీటిని గాయత్రీ పంపుహౌస్ నుంచి ఎత్తిపోసినట్టు ఈఈ నూనె శ్రీధర్ తెలిపారు.